యాదగిరిగుట్ట (ఆలేరు) : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయంలో ఆస్థాన పరంగా పూజలు.. బాలాలయ ఉత్సవ మూర్తులకు నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, ఉత్సవ నిర్వాహకులకు కంకణ ధారణ, సాయంత్రం పుట్టమట్టిలో నవధాన్యాలను నాటడంతో అంకురారోపణం.. ఇవి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల తొలినాటి పూజా వైభవాలు. ఆలయ అర్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం, పారాయణీకులు పంచరాత్రాగమ శాస్త్రానుసారంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. తొలిపూజలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ అనితారామచంద్రన్, ఆలయ స్థానాచార్యులు రాఘవాచార్యులు,ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కారంపూడి నర్సింహచార్యులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రుత్వికులు, పారాయణీకులు, పండితులు, ఆచార్యులకు హైదరాబాద్‌లోని సుప్రజ హోటల్ యాజమాన్యం ఆలయం తరపున దీక్షా వస్త్రాలను అందజేసింది.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలో నిత్యారాధనలు పూర్తయిన తరువాత ఉదయం 10గంటలకు విశ్వక్సేన ఆరాధనతో ఉత్సవాలను ఆచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు.